ఎల్ఐసీపై ఎన్‌సీడీఆర్‌సీ తీవ్ర విమర్శ

9:17 PM

(0) Comments

పాలసీని జారీ చేసేటప్పుడే ఆ పాలసీ తాలూకు నియమ నిబంధనలను పూర్తిగా తెలియజేయకుండా పాలసీదారు ప్రయోజనాలను ఎంత మాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడమేమిటని భారతీయ జీవిత బీమా సంస్థను (ఎల్ఐసీ) జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం (ఎన్‌సీడీఆర్‌సీ) తీవ్రంగా విమర్శించింది. బీమా ఏజెంట్లు ఎంత సేపూ కంపెనీ పాలసీలను అధిక సంఖ్యలో విక్రయించి ప్రీమియం మొత్తాలను గరిష్ఠ స్థాయిలో సేకరించడం, తద్వారా తాము కూడా సొమ్ము చేసుకోవడం పైనే ఆసక్తితో ఉంటున్నారని ఎన్‌సీడీఆర్‌సీ సభ్యులు ఆర్.కె.బట్టా, పి.డి.షెనాయ్‌లు అధిక్షేపించారు. ఒక కేసు విషయంలో ఎల్ఐసీ వినతిని వారు తోసిపుచ్చుతూ, ఈమేరకు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
కేసు వివరాలు: సునీల్ జైన్ 2002లో తన కుమార్తె బేబీ మోనా జైన్ కోసం ఒక ఎల్ఐసీ పాలసీని తీసుకొన్నారు. బీమా రిస్క్ ప్రారంభం అయ్యే కన్నా ముందే, 2005లో మోనా చనిపోయింది. దీంతో పాలసీ కూడా రద్దయిపోయింది. జైన్ పరిహారం కోసం దరఖాస్తు ఇవ్వగా, ఆ క్లెయిమును ఎల్ఐసీ తిరస్కరించింది. పాలసీ ప్రత్యేక నియమాలను ఎల్ఐసీ ఏజెంటు తనకు విడమరచి చెప్పలేదని, మొదటి విడత ప్రీమియం చెల్లించిన నాటి నుంచి రిస్క్ అమలులోకి వచ్చిందని తాను భావించానని జైన్ వాదించారు. పాలసీ జారీ సమయంలో పాలసీకి సంబంధించిన అన్ని క్లాజులను ఏజెంటు జైన్‌కు తెలియబరచలేదు. ''కవర్ నోట్''లో మాత్రమే పాలసీ షరతులను పేర్కొన్నారు. (బీమా పాలసీని జారీ చేస్తున్నట్లు తెలిపే పత్రమే కవర్ నోట్. ఇందులో పాలసీ తాలూకు పూర్తి సమాచారం పొందుపరచి ఉంటుంది). కవర్ నోట్‌ను పరిశీలించిన కమిషన్, పాలసీని ప్రతిపాదించిన తేదీ నాటి నుంచి నాలుగు సంవత్సరాలు గడచిన తరువాత మాత్రమే అమల్లోకి వస్తుందన్న ప్రత్యేక నిబంధన, రిస్క్ ప్రారంభం అయ్యే లోపే సంభవించిన పక్షంలో పాలసీ రద్దు అవుతుందన్న వివరణ అందులో ఉందన్న సంగతిని గుర్తించింది. ప్రీమియం వసూలు చేసి, కవర్ నోట్‌ను జారీ చేసే కన్నా ముందే వినియోగదారుకు పాలసీ క్లాజులన్నింటినీ వివరించడం ఎల్ఐసీ, ఆ సంస్థ ఏజెంట్‌ల కర్తవ్యమని కమిషన్ స్పష్టం చేసింది.

Udaya Kumar Gali

, ,

0 Responses to "ఎల్ఐసీపై ఎన్‌సీడీఆర్‌సీ తీవ్ర విమర్శ"

Post a Comment