498(ఎ) చట్టంలో మార్పులు తేవాలి
మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ రక్షణ చట్టాల దుర్వినియోగాన్ని ఖండిస్తూ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో సంస్థ ప్రతినిధులు చల్లా ఉమా, అనురాధ, విజయభారతితో పాటు పలువురు బాధితులు పాల్గొని దుర్వినియోగం అవుతున్న 498(ఎ) చట్టంలో వెంటనే మార్పులు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఈ చట్టం పలువురు అమాయకులను నిర్బంధంలోకి తోసేస్తుందన్నారు. ఒక పురుషుడికి తల్లి, చెల్లి, అక్క, వదిన అయిన పుణ్యానికి 498(ఎ) చట్టం వల్ల అరెస్టు అవుతున్నారని అన్నారు. నేరంతో ఎలాంటి సంబంధం లేకపోయినా సదరు మహిళ ఇచ్చే ఫిర్యాదుతో కుటుంబసభ్యులు అరెస్టు కావాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. ఫిర్యాదుదారులు మాత్రమే మహిళలా? ఇతరులు కారా? అని ప్రశ్నించారు. ఈ చట్టం కింద ప్రతి 20 నిమిషాలకు ఒక మహిళ అరెస్టు అవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళల హక్కుల పరిరక్షణ పేరిట అమాయకుల మానవ హక్కులను ఉల్లఘించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 'వరకట్నం' పేరిట పెడుతున్న కేసుల వల్ల ఎన్నో జీవితాలు బలయ్యాయని గుర్తు చేశారు. ఈ దృష్ట్యా 498(ఎ) చట్టంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీపుల్స్ గ్రీవెన్స్ ఫోరం కన్వీనర్ శ్రీనివాస్‌యాదవ్, బాధిత తల్లులు సరోజినీదేవి, విజయలక్ష్మీ తదితరులు పాల్గొని మాట్లాడారు.
0 Responses to "498(ఎ) చట్టంలో మార్పులు తేవాలి"
Post a Comment