వి.ఎస్.ఎస్.లతో గిరిజన కుటుంబాలకు లబ్ధి
విశాఖపట్నం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాల వల్ల గిరిపుత్రుల జీవన పరిస్థితులు మెరుగవుతున్నాయని రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (ఆర్.ఎ.పి) డి.కె.ఝా పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పరిధిలో మొత్తం 5డివిజన్లలో 'వన సంరక్షణ సమితి సభ్యుల పునరావాస పథకం' అమలు తీరును పర్యవేక్షించేందుకు ఏర్పాటైన స్వతంత్ర సభ్యుల పర్యవేక్షక సంఘం సమీక్ష ఫలితాలను వెల్లడించిన సందర్భంగా ఝా మాట్లాడుతూ 5 అటవీ డివిజన్లలో చాలా మంది ఆదివాసీలు, గిరిజనులు పోడు వ్యవసాయం మాని, వన సంరక్షణ సంఘాలుగా ఏర్పడ్డారని, వాళ్లందరికీ ప్రభుత్వం పునరావాసం కల్పించేందుకు సాయం చేస్తోందని వివరించారు. పోడు భూమిని అప్పగించిన ప్రజలకు నష్ట పరిహారం ఇచ్చేలా 2000 నుంచి జె.ఎఫ్.ఎం. రెండో దశ (రీసెటిల్‌మెంట్ యాక్షన్ ప్లాన్- ఆర్.ఎ.పి) అమలు చేస్తున్నారు. మొత్తం రూ. 28 కోట్ల అంచనాతో ప్రారంభించిన ఈ పథకంలో ఇప్పటికి రూ. 7 కోట్లు ఖర్చు చేసి, 434 గ్రామాల్లోని 11,600 కుటుంబాలకు లబ్ధి చేకూర్చినట్లు ఝా తెలిపారు. ఈ ఆర్.ఎ.పి. అమలు తీరును పర్యవేక్షించేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ భాస్కరరావు నేతృత్వంలో వివిధ రంగాలకు చెందిన ఐదుగురు నిపుణులు సభ్యులుగా ఒక 'స్వతంత్ర సలహా బృందం'(ఇండిపెండెంట్ అడ్వైజరీ గ్రూప్- ఐ.ఎ.జి)ను ప్రభుత్వం నియమించింది.
0 Responses to "వి.ఎస్.ఎస్.లతో గిరిజన కుటుంబాలకు లబ్ధి"
Post a Comment