జనన మరణాల వార్షిక నివేదిక

12:57 AM

(0) Comments

జనన మరణాల వార్షిక నివేదిక-2006ను ఆర్థిక, ప్రణాళిక శాఖల మంత్రి డాక్టర్ ఎ.కె.వాలియా 24.10.2007 బుధవారం విడుదల చేశారు. నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఢిల్లీలో జనన, మరణాల రేటు జాతీయ స్థాయి కంటే తక్కువగా ఉంది. ఏటా ప్రతి వెయ్యి మందికి జనన రేటు జాతీయ స్థాయిలో 23.8 ఉండగా, ఢిల్లీలో 19.95 మాత్రమే నమోదయింది. మరణాల రేటు జాతీయ స్థాయిలో ఏటా వెయ్యిమంది జనాభాకు 7.6 ఉండగా ఢిల్లీలో 6.11 ఉంది. దేశంలో ప్రతిరోజూ 71812 మంది జన్మిస్తుండగా, అందులో 884 మంది ఢిల్లీలో పురుడుపోసుకొంటున్నారు. రోజూ దేశంలో 22932 మంది మరణిస్తుండగా ఢిల్లీలో 271 మంది మరణిస్తున్నారు. ఢిల్లీలో 2005లో 3.24 లక్షల జననాలు నమోదుకాగా 2006లో 3.23 లక్షలు నమోదయ్యాయి. 2006లో నమోదయిన 3.23 లక్షల జననాల్లో అబ్బాయిలు 1.76 లక్షలు ఉండగా అమ్మాయిలు 1.47 లక్షలు మాత్రమే. అంతకు ముందు ఏడాది 1.78 లక్షల మంది అబ్బాయిలు, 1.46 లక్షల మంది అమ్మాయిలు ఢిల్లీలో జన్మించారు. 2005తో పోలిస్తే 2006లో అమ్మాయిల జననాల సంఖ్య పెరిగింది. ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 2005లో 822 మంది అమ్మాయిలు జన్మించగా 2006లో 831కు పెరిగింది. జననాల సంఖ్య కూడా తగ్గింది. ప్రతి వెయ్యి మంది జనాభాకు 2005లో 20.61 జననాలు నమోదుకాగా.. 2006లో 19.95కు తగ్గింది. ప్రతిరోజూ నమోదవుతున్న జననాల సంఖ్య కూడా 889 నుంచి 884కు దిగివచ్చింది. మొత్తం 78 శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. అంతకు ముందు ఏడాది 74 శాతం ప్రసవాలే ఆసుపత్రుల్లో జరిగేవి. ప్రతి వెయ్యి మంది జనాభాకు 2006లో 6.11 మరణాలు నమోదు కాగా అంతకు ముందు ఏడాది 7.6గా నమోదయ్యాయి. 2006లో 98908 మంది మరణించగా... అందులో 37 శాతం మంది 60 ఏళ్లు, అంతకన్నా వయసు పైబడిన వాళ్లు ఉన్నారు. 22 శాతం మంది 31-50 వయసుల వాళ్లు. 15 శాతం మంది 51-60 మధ్య వయస్కులు. 12 శాతం మంది 15-30 సంవత్సరాల యువకులు. 14 శాతం మంది 14 సంవత్సరాల వయసు లోపలి వాళ్లే. వీటితో పాటు 5825 శిశుమరణాలు కూడా నమోదయ్యాయి. ఇంటి వద్దే పురుడు పోసుకున్న శుశువుల్లో 60 శాతం మంది చనిపోయారు.

Udaya Kumar Gali

, ,

0 Responses to "జనన మరణాల వార్షిక నివేదిక"

Post a Comment