రైళ్లలో సీసీ కెమెరాలు
ముంబయి రైల్వే అధికారులు సబర్బన్ రైళ్లలోని మహిళల బోగీల్లో క్లోజ్‌డ్ సర్క్యూట్ (సీసీ) కెమెరాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ రైల్వే పరిధిలో ప్రథమ శ్రేణి మహిళా బోగీల్లో ఆరు సి.సి. కెమెరాలను బిగించారు. ఆడ పిల్లలను వేధించే వారిపై, జేబులు కత్తిరించే వారిపై, ఇతరత్రా అల్లర్లకు పాల్పడే వారిపై కన్నేసి ఉంచేందుకు వీటిని బిగించారు. ఇవి సత్ఫలితాలిస్తే మిగతా రైళ్లలో కూడా ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. తీవ్రవాదుల దాడులకు సబర్బన్ రైళ్లు ఎంత అనుకూలమో గత ఏడాది జులై 11వ తేదీన జరిగిన బాంబు పేలుళ్లు వెల్లడించాయి. దీంతో రైళ్లలోనూ, రైల్వే స్టేషన్లలోనూ భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించారు. చర్చి గేటు, విరార్ మధ్య ఉన్న రైల్వే స్టేషన్లన్నిటిలో సి.సి. టి.వి.లు ఏర్పాటు చేయడానికి పశ్చిమ రైల్వే అంగీకరించింది. ఇప్పటి వరకు 66 సి.సి. టి.వి.లను నెలకొల్పింది. ఇప్పుడు రైళ్ల లోపల వీటిని నెలకొల్పడం వల్ల ప్రయాణికులు, ప్రత్యేకించి మహిళా ప్రయాణికుల విశ్వాసం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. రైలు ప్రవేశ ద్వారంతో పాటు కూర్చున్న, నిలబడిన మహిళలందరినీ సి.సి. టి.వి.లు కవర్ చేస్తాయి. సెక్యూరిటీతో పాటు మహిళల మెడల్లో గొలుసులు లాక్కెళ్లడం, జేబులు కత్తిరించడం లాంటి సంఘటనలపై కూడా కన్నేసి ఉంచడానికి దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. 15 రోజుల్లో జరిగిన సంఘటనల వివరాలన్నీ ఈ కెమెరాలు అందచేస్తాయి.
0 Responses to "రైళ్లలో సీసీ కెమెరాలు"
Post a Comment