స్మార్టుకార్డులతో రూ.18 కోట్లు ఆదా
సామాజిక పింఛన్లు, ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించే స్మార్టుకార్డుల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనివల్ల నకిలీలను అరికట్టడంతో పాటు ఏటా సుమారు రూ.18 కోట్లు ఆదా చేయవచ్చని అధికారుల అంచనా . ప్రస్తుతం వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా కొన్ని మండలాల్లో ఈ ప్రక్రియను అమలు చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఆరు జిల్లాల్లో, వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్రమంతటా వర్తింపచేయాలని భావిస్తున్నారు. ఇందుకు 13 బ్యాంకులతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు. మౌలిక వసతులను బ్యాంకులు సమకూర్చనున్నాయి. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు స్మార్టుకార్డుల వినియోగంపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలోనే పూర్తి చేయనుంది. అనంతరం తొలుత సామాజిక పింఛన్ల లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తారు. తర్వాత గ్రామాల్లో ఎంపికజేసిన మహిళలకు శిక్షణ ఇస్తారు. ఈ ప్రక్రియ అంతా ఫిబ్రవరి మూడోవారానికల్లా ముగించి లబ్ధిదారులకు స్మార్టుకార్డులను పంపిణీ చేస్తారు. తొలివిడతగా వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏప్రిల్ నుంచి స్మార్టుకార్డుల ద్వారా పింఛన్లు పంపిణీ ప్రారంభిస్తారు. డిసెంబరు నాటికి రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఈ సేవలను విస్తరించనున్నారు.
0 Responses to "స్మార్టుకార్డులతో రూ.18 కోట్లు ఆదా"
Post a Comment