ఫార్మా సంస్థలకు ఔషధ నియంత్రణశాఖ నోటీసులు

6:00 AM

(0) Comments

అనుమతులు లేకుండా రాష్ట్రంలో అమ్ముతున్న పలు మందును ఔషధ నియంత్రణశాఖ నిషేధించింది. రాష్ట్రంలో 33 రకాల (కాంబినేషన్ల) మందులు అనుమతులు లేకుండా అమ్ముతున్నట్లు గుర్తించామని, పది కంపెనీలు ( డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, బయోలాజికల్‌ఈ, నాట్కోఫార్మా, అరబిందో ఫార్మా, కాంటెస్ట్‌ కెమికల్స్‌, సిటాడెల్‌, వ్యాన్‌గార్డ్‌, నోయల్‌ఫార్మా, టార్‌గాఫ్‌, యూనిసాన్‌క్యో కంపెనీలు) వీటిని తయారు చేస్తున్నాయని ఔషధ నియంత్రణ శాఖ డీజీ ఆర్‌.పి.మీనా చెప్పారు. ఇలాంటి మందులపై డ్రగ్స్‌, కాస్మొటిక్స్‌ చట్టం 122ఈ నిబంధన ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ మందుల్ని తయారుచేస్తున్న ఫార్మా కంపెనీలు 15 రోజుల్లోగా మార్కెట్లోని తమ ఉత్పత్తుల్ని వెనక్కు తీసుకోవాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జ్వరం, జలుబు వంటి సాధారణ రుగ్మతల మొదలు వివిధ జబ్బుల్ని తగ్గించే మందులు, యాంటీబయాటిక్స్‌ మొదలైనవి ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిపారు. తాము నిర్వహించిన దాడుల్లో హైదరాబాద్‌లోనే రూ.1.41 కోట్లు, విశాఖపట్నంలో రూ.53 లక్షలు, విజయవాడ పరిధిలో రూ.2 కోట్ల విలువైన మందుల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మందులకు జాతీయ ఔషధ నియంత్రణ శాఖ అనుమతులు తీసుకోకుండా ఇతర రాష్ట్రల్లో నామమాత్రపు అనుమతులు తీసుకుని మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు మీనా పేర్కొన్నారు. ఇలాంటి మందులు వినియోగించే వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని, కాబట్టి మందుల వాడకంలో జాగ్రత్త వహించాలని సూచించారు.

Udaya Kumar Gali

, ,

0 Responses to "ఫార్మా సంస్థలకు ఔషధ నియంత్రణశాఖ నోటీసులు"

Post a Comment