పొయ్యి కొంటేనే రీ కనెక్షన్

5:47 AM

(0) Comments

'ఒకటి కొంటే మరోటి ఉచితం' అనే చౌకబేరం కాదిది. 'ఒకటి కొనకపోతే... అర్హమైన మరోదాన్నీ పొందలేరు' అన్న ఖరీదైన కొత్త పథకం ఇది. దీన్ని నడిపిస్తున్నది చమురు కంపెనీలు. అమలుచేస్తున్నది రాష్ట్రంలోని గ్యాస్‌డీలర్లు. ఇప్పటికే వివిధ గ్యాస్ సమస్యల్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వినియోగదారుడు తాజాగా చమురు కంపెనీల 'గ్రీన్ స్టౌ' మంటపై కుతకుతా ఉడికిపోతున్నాడు. 'మేం సరఫరాచేసే గ్రీన్ లేబుల్ స్టౌను కొంటేనే మీకు కనెక్షన్లు ఇచ్చేది' అంటూ గ్యాస్‌డీలర్ల ప్రతినిధులు ఇళ్లకొచ్చీ మరీ చేస్తున్న ఒత్తిళ్లు వినియోగదారులకు దిమ్మదిరిగేలా చేస్తున్నాయి. ప్రస్తుతానికి రీ కనెక్షన్ కోసం వచ్చేవారిపై ఇలాంటి ఒత్తిళ్లు చేస్తున్నారు. బలవంతంగా స్టౌలు కొనిపిస్తున్నారు. మున్ముందు గ్యాస్ కనెక్షన్ కలిగిన రాష్ట్రంలోని కోటి మూడు లక్షల కుటుంబాలకూ ఈ స్టౌలను అంటగట్టేందుకు చమురు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. తద్వారా భారీ ఆదాయంపై కన్నేశాయి.
కొత్త స్టౌ కొనసాల్సిందేనన్న ఒత్తిళ్లు గతంలో గ్యాస్ డీలర్ల కార్యాలయాలకు వచ్చే వినియోగదారులపై ఉండేవి. ఒకవేళ కొత్త స్టౌ కొనకపోయినా కొన్నిసార్లు చూసీ చూడనట్లు వదిలేసి రీ కనెక్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు డీలర్ల ప్రతినిధులే వినియోగదారుడి ఇంటికి వెళుతున్నారు. కొత్త స్టౌ కొనకపోతే మాత్రం రీ కనెక్షన్ ఇవ్వడం లేదు.

రీఫిల్ చేసిన గ్యాస్ సిలిండర్లను ఇంకొన్ని ఎక్కువ రోజులు వినియోగించుకునేందుకు వీలుగా గ్రీన్‌లేబుల్ స్టౌల తయారీని చమురు కంపెనీలు మొదలు పెట్టించాయి. వీటి వల్ల కాలుష్యం ఏర్పడదని చమురు కంపెనీలు చెబుతున్నాయి. వీటిని గ్యాస్ డీలర్ల ద్వారా వినియోగదారులకు విక్రయించాలని తలపెట్టాయి. ఇందులో తొలివిడతగా... రీ కనెక్షన్ కోరుకునే వారికి విక్రయించాలని నిర్ణయించాయి. ఓ పట్టణం నుంచి మరో పట్టణానికి బదిలీపైనో, ఇతరత్రా కారణంతోనో వినియోగదారులు మారితే... రీ-కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. వీరికి కనెక్షన్ ఇవ్వాలంటే కొత్త గ్రీన్ లేబుల్ స్టౌ కొనాల్సిందేనని డీలర్లు షరతు పెడుతున్నారు. సంబంధిత వినియోగదారుని ఇంటికి గ్యాస్ డీలర్ల ప్రతినిధులు వెళ్లి వారు ఉపయోగిస్తున్న స్టౌను పరిశీలిస్తున్నారు. ఈ పాత స్టౌ స్థానే తమ దగ్గరున్న గ్రీన్‌లేబుల్ స్టౌను కొనాల్సిందేనని పట్టుబుడుతున్నారు. అలా కొన్నాకే రీ-కనెక్షన్ ఇస్తున్నారు. అప్పటి దాకా వినియోగదారుడు ఉపయోగిస్తున్న స్టౌకు రూ.100 నుంచి రూ.200 వరకు లెక్కగడుతున్నారు. వారు ఇచ్చే గ్రీన్ స్టౌకు మాత్రం రేటును రూ.700 నుంచి రూ.2 వేల వరకు వసూలుచేస్తున్నారు. దీంతో పాటు సురక్ష ట్యూబ్ పేరుతో రూ.180 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తున్నారు. ఇదంతా జరిగాకే రీ-కనెక్షన్ ఇస్తున్నారు.

Udaya Kumar Gali

,

శ్రీవారి ప్రసాదానికి భౌగోళిక అనుకరణ హక్కు

8:30 PM

(0) Comments

లడ్డూ లాంటి కబురు! తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి భక్తులకు ప్రసాదంగా ఇచ్చే తిరుపతి లడ్డూకు భౌగోళిక అనుకరణ హక్కు (జియోగ్రాఫికల్ కాపీరైట్) లభించింది. వేరెవరు కూడా తిరుపతి లడ్డూ పేరును ఉపయోగించుకోకుండా, ఆ పేరుతో మిఠాయిని మార్కెట్ చేయకుండా జీఐ నిషేధిస్తుంది. ఓ ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ.. భక్తులకు అందించే ప్రసాదాన్ని భౌగోళిక సూచిక నమోదు కేంద్రం (జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ-జీఐఆర్)లో నమోదు చేసుకోవడం ఇదే మొదటిసారి.
శ్రీవారి లడ్డూకు ఉన్న ప్రత్యేకత ఎనలేనిది. తిరుమల వెళ్లిన భక్తులను లడ్డూలు తెచ్చారా అని ప్రతి ఒక్కరూ ఆత్రుతగా అడిగి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అంతటి రుచి, ప్రాముఖ్యం ఉన్న దృష్ట్యా చాలాకాలంగా దీనిపై హక్కులు తీసుకోవాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. చెన్నైలోని భౌగోళిక సూచిక నమోదు కేంద్రం (జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజస్ట్రీ-జీఐ)లో రెండేళ్ల క్రితం ఈ హక్కు కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తరఫున అప్పటి ఈవో రమణాచారి దరఖాస్తు చేశారు.మంగళవారం ఢిల్లీలోని ప్రధాన కేంద్రం నుంచి జాబితాలో చేర్చినట్లు సమాచారం అందింది. ''తిరుపతి లడ్డూను గుర్తిస్తూ జీఐ ధ్రువీకరణ పత్రాన్ని తితిదేకు మంజూరు చేస్తున్నాం. ఇప్పటి నుంచి ఈ లడ్డూకు చట్టం రక్షణ ఇస్తుంది. దీన్నెవరూ అనుకరించలేరు'' అని ట్రేడ్‌మార్క్స్, జీఐ సహాయ రిజిస్ట్రార్ వర్మ వెల్లడించారు. పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్‌మార్కుల కంట్రోలర్-జనరల్ పి.హెచ్.కురియన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఇకపై తితిదే అనుసరించే 'దిట్టం' ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ ఆధ్యాత్మిక, ఇతర సంస్థలు, వ్యక్తులు లడ్డూలను తయారు చేయరాదు. ఈ నమూనాను కూడా ఇతరులు అనుకరించే వీలు లేదు. 51 వేల లడ్డూలను 'దిట్టం'గా పరిగణిస్తారు. 'దిట్టం' కింద శనగపిండి-2 వేల కిలోలు, చక్కెర-4 వేల కిలోలు, నెయ్యి-1850 కిలోలు, గోడంబి-350 కిలోలు, ద్రాక్ష-87.5 కిలోలు, యాలకులు-50 కిలోలు, కలకండ-50 కిలోలు లడ్డూ తయారీకి వినియోగిస్తారు. లడ్డు తయారీ, నమూనా, దిట్టం, ఆకారాలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవు.

జీఐ ప్రకారం.. ఒక ఉత్పత్తిని విక్రయించుకునే హక్కు సంబంధిత భౌగోళిక ప్రాంతంతో ముడిపడి ఉంటుంది. ఆ హక్కు లభించిన ఉత్పత్తులు అదే ప్రాంతంలో తయారు కావాలి. ఒక ప్రాంతంలో దీర్ఘకాలికంగా విశిష్టత సాధించిన బ్రాండ్‌నేమ్‌ను మరెవరూ సొమ్ము చేసుకోకుండా ఈ హక్కు సంరక్షిస్తుంది. హక్కును ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలకు అవకాశం కల్పిస్తుంది. భౌగోళిక అనుకరణ హక్కు.. మేధో సంపత్తి హక్కుల్లో భాగం.